Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Psalms 147 OTSA

Side by side with the Father's Heart Bible™

1యెహోవాను స్తుతించండి,మన దేవుని స్తుతించడం ఎంత మంచిది,ఆయనను స్తుతించడం ఎంత మనోహరమైనది, తగినది!

2యెహోవా యెరూషలేమును కట్టిస్తారు;ఇశ్రాయేలు వారిలో నుండి చెరగొనిపోబడిన వారిని ఆయన సమకూరుస్తారు.

3విరిగిన హృదయం గలవారిని బాగుచేస్తారు.వారి గాయాలను నయం చేస్తారు.

4ఆయన నక్షత్రాలను లెక్కిస్తారు,సమస్తాన్ని పేరు పెట్టి పిలుస్తారు.

5మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి కలవాడు;ఆయన గ్రహింపుకు పరిమితి లేదు.

6యెహోవా దీనులను ఆదరిస్తారుకాని దుష్టులను నేలమట్టం చేస్తారు.

7యెహోవాకు కృతజ్ఞత స్తుతులు పాడండి;సితారా మీటి దేవునికి స్తుతులు పాడండి.

8ఆయన ఆకాశాన్ని మేఘాలతో కప్పుతారు;భూమికి వర్షమిచ్చికొండలపై గడ్డి మొలిపిస్తారు.

9ఆయన పశువులకు కూసే కాకులకుఆహారం సమకూరుస్తారు.

10గుర్రం బలాన్నిబట్టి ఆయన సంతోషించరు.యోధుల కాల్బలంలో ఆనందించరు.

11ఆయనకు భయపడు వారిని బట్టి, ఆయన మారని ప్రేమ యందు నిరీక్షణ గలవారిని బట్టియెహోవా ఆనందిస్తారు.

12యెరూషలేమా, యెహోవాను ఘనపరచు;సీయోనూ, నీ దేవుని స్తుతించు.

13ఆయన మీ గుమ్మాల గడియలు బలపరుస్తారుమీలో మీ ప్రజలను దీవిస్తారు.

14ఆయన మీ పొలిమేరల్లో సమాధానం అనుగ్రహిస్తారుమంచి గోధుమలతో పంటనిచ్చి మిమ్మల్ని తృప్తిపరుస్తారు.

15ఆయన భూమిని ఆజ్ఞాపిస్తారు;ఆయన శాసనం వేగంగా పరుగెత్తుకొని పోతుంది.

16ఆయన మంచును తెల్లని ఉన్నిలా పంపిస్తారుమంచు కణాలను బూడిదలా చెదరగొడతారు.

17ఆయన వడగండ్లను గులకరాళ్లలా విసిరివేస్తాడు.ఆయన పుట్టించే తీవ్రమైన చలికి ఎవరు తట్టుకోగలరు?

18ఆయన తన మాటను పంపుతారు, అవన్నీ కరిగిపోతాయి;గాలి వీచేటట్టు చేస్తారు, నీళ్లు పారతాయి.

19ఆయన యాకోబుకు తన వాక్కును,ఇశ్రాయేలుకు తన న్యాయవిధులను శాసనాలను బయలుపరచారు.

20ఏ ఇతర జాతికి కూడా ఆయన ఈ విధంగా జరిగించలేదు;ఆయన న్యాయవిధులు వారికి తెలియవు.యెహోవాను స్తుతించండి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]