Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Isaiah 21 OTSA

Side by side with the Father's Heart Bible™

బబులోనుకు వ్యతిరేకంగా ప్రవచనం

1సముద్రపు తీరాన ఉన్న ఎడారికి వ్యతిరేకంగా ప్రవచనం:దక్షిణ దిక్కున సుడిగాలి వీచినట్లుగాఎడారిలో నుండిభయంకరమైన దేశం నుండి దోచుకునేవాడు వస్తాడు.

2భయంకరమైన దర్శనం నాకు వచ్చింది:మోసం చేసేవారు మోసం చేస్తారు, దోచుకొనేవారు దోచుకుంటారు.ఏలామూ, వెళ్లి దాడి చేయి! మెదీయా, ముట్టడించు!దాని మూలుగు అంతటిని నేను ఆపివేస్తాను.

3కాబట్టి నా నడుము చాలా నొప్పిగా ఉంది,ప్రసవించే స్త్రీ వేదన నాకు కలిగింది;నేను విన్నదానిని బట్టి నేను తడబడ్డాను,నేను చూసిన దానిని బట్టి నేను దిగ్భ్రాంతి చెందాను.

4నా గుండె దడదడలాడుతుందిభయంతో వణుకు పుడుతుంది;నేను ఇష్టమైన సంధ్యవేళనాకు భయం పుట్టించింది.

5వారు భోజనపు బల్లలను సిద్ధం చేశారు,వారు తివాసీలు పరిచారు,వారు తిని త్రాగుతారు!అధిపతులారా! లేవండిడాళ్లకు నూనె రాయండి.

6ప్రభువు నాతో చెప్పిన మాట ఇదే:“వెళ్లి కాపలా పెట్టండిఅతడు చూసింది తెలియజేయాలి.

7అతడు రథాలనుగుర్రాల జట్లనుగాడిదల మీద వచ్చేవారినిఒంటెల మీద వచ్చేవారిని చూడగానేఅతడు జాగ్రత్తగాచాలా జాగ్రత్తగా ఉండాలి.”

8కావలివాడు సింహంలా కేకలు వేసి“నా ప్రభువా, ప్రతిరోజు పగలంతా కావలి గోపురం మీద నిలబడుతున్నాను;రాత్రంతా కాపలా కాస్తూనే ఉన్నాను.

9చూడు, జతలు జతలుగా గుర్రపు రౌతులతో కలిసిరథం మీద ఓ మనిషి వస్తున్నాడు అనగాఅతడు ఇలా సమాధానం చెప్పాడు:‘బబులోను కూలిపోయింది, కూలిపోయింది!దాని దేవతల విగ్రహాలన్నీనేలమీద బద్దలై పడి ఉన్నాయి.’ ”

10నూర్పిడి కళ్ళాల్లో నలిగిపోతున్న నా ప్రజలారా!సైన్యాల యెహోవా నుండిఇశ్రాయేలు దేవుని నుండినేను విన్నది నీకు చెప్తాను.

ఎదోముకు వ్యతిరేకంగా ప్రవచనం

11దూమాకు వ్యతిరేకంగా ప్రవచనం:ఒకడు శేయీరులో నుండి నన్ను పిలుస్తున్నాడు,“కావలివాడా, రాత్రి ఇంకా ఎంత ఉంది?కావలివాడా, రాత్రి ఇంకా ఎంత ఉంది?”

12కావలివాడు, “ఉదయం అవుతుంది,రాత్రి కూడా అవుతుంది.మీరు అడగాలనుకుంటే అడగండి;మరలా తిరిగి రండి” అని సమాధానం ఇస్తాడు.

అరేబియాకు వ్యతిరేకంగా ప్రవచనం

13అరేబియాకు వ్యతిరేకంగా ప్రవచనం:అరేబియా ఎడారిలో బసచేసేదెదానీయులైన యాత్రికులారా,

14మీరు దాహంతో ఉన్నవారికి నీళ్లు తీసుకురండి;తేమా దేశ నివాసులారా,పారిపోతున్నవారి కోసం ఆహారం తీసుకురండి.

15ఖడ్గం నుండి,దూసిన ఖడ్గం నుండి,ఎక్కుపెట్టిన బాణాల నుండి,తీవ్రమైన యుద్ధం నుండి వారు పారిపోతారు.

16ప్రభువు నాతో చెప్పిన మాట ఇదే: “కూలివాని లెక్క ప్రకారం ఒక సంవత్సరంలోనే కేదారు వైభవమంతా ముగిసిపోతుంది. 17కేదారు వీరులైన విలుకాండ్రలో కొంతమందే మిగిలి ఉంటారు.” ఇలా జరుగుతుందని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]