Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Hosea 12 OTSA

Side by side with the Father's Heart Bible™

1ఎఫ్రాయిం గాలిని మేస్తున్నాడు;అతడు రోజంతా తూర్పు గాలిని వెంటాడుతున్నాడు,విస్తారంగా అబద్ధాలాడుతూ, దౌర్జన్యం చేస్తున్నాడు.అతడు అష్షూరుతో ఒప్పందం చేస్తున్నాడుఈజిప్టుకు ఒలీవనూనె పంపిస్తున్నాడు.

2యెహోవా యూదా మీద నేరారోపణ చేస్తున్నారు;ఆయన యాకోబును తన మార్గాలను బట్టి శిక్షిస్తారుఆయన అతని క్రియలనుబట్టి అతనికి ప్రతిఫలం ఇస్తారు.

3తల్లి గర్భంలో అతడు తన సోదరుని కాలి మడమను పట్టుకున్నాడు;అతడు పెద్దవాడయ్యాక దేవునితో పోరాడాడు.

4అతడు దేవదూతతో పోరాడి గెలిచాడు;అతడు ఏడ్చి, దయచూపమని వేడుకున్నాడు.బేతేలులో అతడు దేవున్ని కనుగొన్నాడుఅక్కడ అతడు ఆయనతో మాట్లాడాడు.

5ఆయన సైన్యాల అధిపతియైన యెహోవా,ఆయన పేరు యెహోవా!

6అయితే నీవు నీ దేవుని దగ్గరకు తిరిగి రావాలి;ప్రేమ, న్యాయం కలిగి ఉండాలి,నీ దేవుని కోసం ఎల్లప్పుడు వేచి ఉండాలి.

7వ్యాపారి తప్పుడు తూకం వాడుతూమోసం చేయడానికి ఇష్టపడతాడు.

8“నేను చాలా ధనవంతుడను;నాకున్న ధనాన్ని బట్టి వారు నాలోఏ తప్పును కాని పాపాన్ని కాని చూపించలేరు” అనిఎఫ్రాయిం అతిశయిస్తున్నాడు.

9“మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పటి నుండియెహోవానైన నేను మీకు దేవునిగా ఉన్నాను;మీ నియమించబడిన పండుగ రోజుల్లో ఉన్నట్లునేను మిమ్మల్ని మరలా గుడారాల్లో నివసింపజేస్తాను.

10నేను ప్రవక్తలతో మాట్లాడాను.వారికి అనేక దర్శనాలను ఇచ్చిఉపమానరీతిగా వారికి చెప్పాను.”

11గిలాదు చెడ్డదా?దాని ప్రజలు వ్యర్థమైన వారు!వారు గిల్గాలులో కోడెలను బలి అర్పిస్తున్నారా?వారి బలిపీఠాలు దున్నబడిన పొలంలోనిరాళ్ల కుప్పల్లా ఉన్నాయి.

12యాకోబు అరాము దేశానికి పారిపోయాడు;ఇశ్రాయేలు భార్యను పొందడానికి సేవ చేశాడు,భార్యను సంపాదించడానికి గొర్రెలు కాచాడు.

13యెహోవా ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి తీసుకురావడానికి ఒక ప్రవక్తను వాడుకున్నారు,ప్రవక్త ద్వారా ఆయన వారిని సంరక్షించారు.

14కాని ఎఫ్రాయిం ఆయన మహా కోపాన్ని రేపాడుఅతడు చేసిన రక్తపాతం బట్టి దేవుడు అతని మీద నేరం మోపుతారుఅతని ధిక్కారం బట్టి ఆయన అతనికి ప్రతీకారం చేస్తారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]