Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Telugu - 2019

Hosea 2 IRVTel

Side by side with the Father's Heart Bible™

1మీ సోదరులతో “మీరు నా ప్రజలు” అని చెప్పండి. మీ అక్కచెల్లెళ్ళతో “మీరు కనికరానికి నోచుకున్నారు” అని చెప్పండి.

ఇశ్రాయేలకు శిక్ష, యధాస్థితి

2మీ అమ్మపై న్యాయవిచారణ మొదలుపెట్టు. వ్యాజ్యం వెయ్యి. ఆమె నా భార్యా కాదు, నేనామెకు భర్తనీ కాను. ఆమె మొదట తన వేశ్యా వృత్తిని మానుకోమనండి. తన స్తనాల మధ్య నుండి వ్యభిచారాన్ని తొలగించుకోమనండి.

3లేకపోతే ఆమెను నగ్న శరీరిగా చేస్తాను. ఆమె పుట్టిన దినాన ఎలా ఉన్నదో అలా బట్టలు లేకుండా చేసేస్తాను. ఆమెను అరణ్యంలాగా ఎండిన భూమిలాగా చేస్తాను. దాహంతో అలమటించి చనిపోయేలా చేస్తాను.

4ఆమె పిల్లల మీద జాలి చూపను. ఎందుకంటే దాని పిల్లలు వ్యభిచారం వల్ల పుట్టినవారు.

5వారి తల్లి కులట. వారిని కన్నతల్లి సిగ్గు లేకుండా ప్రవర్తించింది. ఆమె “నా విటుల వెంట పోతాను. వాళ్ళు నాకు అన్నపానాలు, ఉన్ని, జనపనార, నూనె, పానీయం ఇస్తారు” అనుకుంది.

6కాబట్టి దాని దారికి అడ్డంగా ముళ్ళ కంచె వేస్తాను. దానికి దారి కనబడకుండా గోడ కడతాను.

7అది తన విటులను వెంటాడినా వారిని కలుసుకోలేక పోతుంది. ఎంత వెతికినా వారు దానికి కనబడరు. అప్పుడు ఆమె అంటుంది. “నా మొదటి భర్త దగ్గరికి తిరిగి వెళ్తాను. ఎందుకంటే ఇప్పటి కంటే అదే బాగుంది.”

8దానికి ధాన్య ద్రాక్షారస తైలాలను, ధారాళంగా వెండి బంగారాలను ఇచ్చినవాణ్ణి నేనే అని ఆమెకు తెలియలేదు. వాటిని వారు బయలు దేవునికి ఉపయోగించారు.

9కాబట్టి నా ధాన్యాన్ని నా ద్రాక్షారసాన్ని వాటి కోత కాలాల్లో ఆమె దగ్గర నుండి తీసేసుకుంటాను. ఆమె తన నగ్నత కప్పుకోవడానికి ఉపయోగించిన నా ఉన్ని, జనపనార లాగేసుకుంటాను.

10దాని విటులు చూస్తుండగానే ఆమె బట్టలు విప్పేస్తాను. నా చేతిలో నుండి ఆమెను విడిపించే వారెవరూ ఉండరు.

11ఆమె ఉత్సవాలన్నీ ఆపిస్తాను. ఆమె పండగలూ అమావాస్య పర్వదినాలూ విశ్రాంతి దినాలూ వార్షిక ఉత్సవాలు ఆగిపోయేలా చేస్తాను.

12“ఇవి నా విటులు నాకిచ్చిన జీతం” అని వేటిని గురించి చెప్పిందో ఆ ద్రాక్ష చెట్లను అంజూరపు చెట్లను ధ్వంసం చేస్తాను. అడవి జంతువులు వాటిని తినివేసేలా వాటిని కారడవిలాగా చేస్తాను.

13అది బయలు దేవుళ్ళ పండగలు ఆచరించినందుకు నేను దాన్ని శిక్షిస్తాను. ఆ దేవుళ్ళకు ధూపం వేసినందుకు. నగలు పెట్టుకుని, సింగారించుకుని. నన్ను మర్చిపోయి దాని విటులను వెంటాడినందుకు దాన్ని శిక్షిస్తాను. ఇది యెహోవా వాక్కు.

14ఆ తరవాత ఆమెను మళ్లీ నావైపు తిప్పుకుంటాను. ఆమెను అరణ్యంలోకి తీసుకుపోతాను. అక్కడ ఆమెతో ప్రేమగా మాటలాడతాను.

15ఆమెకు ద్రాక్షతోటలు రాసిస్తాను. ఆకోరు లోయను ఆశాద్వారంగా చేస్తాను. యవ్వనప్రాయంలో ఐగుప్తు దేశంలోనుండి వచ్చిన రోజుల్లో నా మాట విన్నట్టు ఆమె నాకు స్పందిస్తుంది.

16“ఆ రోజుల్లో” యెహోవా అంటున్నాడు. “నీవు ‘నా బయలు’ అని నన్ను సంబోధించవు. ‘నా భర్త’ అంటావు.”

17ఇక మీదట బయలు దేవుళ్ళ పేర్లు నీ నోటినుండి తుడిచి వేస్తాను. ఆ పేర్లు ఇక ఎన్నటికీ జ్ఞాపకానికి రావు.

18“ఆ దినాన నేను నా ప్రజల పక్షంగా జంతువులతో, పక్షులతో, నేలపై పాకే జీవులతో నిబంధన చేస్తాను. దేశంలో విల్లును, కత్తిని, యుద్ధాన్ని లేకుండా చేస్తాను. వారు నిర్భయంగా పడుకునేలా చేస్తాను.

19నీకు శాశ్వతంగా భర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను. నీతిన్యాయాలను బట్టి, నిబంధన విశ్వాస్యతను బట్టి, కరుణను బట్టి నీ భర్తగా ఉంటానని మాట ఇస్తున్నాను.

20యెహోవానైన నన్ను నీవు తెలుసుకునేలా నేను నీకు నమ్మకమైన భర్తగా ఉంటానని మాటిస్తున్నాను.

21ఆ దినాన నేను జవాబిస్తాను.” ఆకాశాలు చేసే విన్నపం నేను ఆలకిస్తాను. అవి భూమి చేసే మనవికి జవాబు ఇస్తాయి.

22భూధాన్య ద్రాక్షారస తైలాల మనవి ఆలకింపగా, అవి యెజ్రెయేలు చేసే మనవి ఆలకిస్తాయి.

23నేను ఆమెను భూమిలో నాకోసం నాటుతాను. లో రుహమా పై నేను జాలి పడతాను. నా ప్రజలు కానివారితో “మీరే నా ప్రజలు” అని నేను చెప్పగా, వారు “నీవే మా దేవుడివి” అంటారు. ఇదే యెహోవా వాక్కు.

TEL-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Telugu - 2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]