Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Telugu - 2019

Job 14 IRVTel

Side by side with the Father's Heart Bible™

1స్త్రీ కడుపున పుట్టిన మనిషి కొన్ని రోజులపాటు జీవిస్తాడు. అతడు తన జీవిత కాలమంతా కష్టాలు అనుభవిస్తాడు.

2అతడు పువ్వులాగా పెరిగి వికసిస్తాడు. అంతలోనే వాడిపోతాడు. నీడ కనబడకుండా పోయినట్టు వాడు పారిపోతాడు.

3అలాంటి వాడిని నువ్వు పట్టించుకుంటున్నావా? నాకు తీర్పు తీర్చడానికి నీ ఎదుటికి రప్పించుకుంటావా?

4అపవిత్రమైన వ్యక్తికి పవిత్రుడైనవాడు పుట్టగలిగితే ఎంత మేలు? కానీ ఆ విధంగా ఎన్నడూ జరగదు.

5మనిషి ఎంతకాలం బ్రతకాలో దానికి పరిమితి నువ్వే నియమిస్తావు. అతడు ఎన్ని నెలలు జీవిస్తాడో నీకు తెలుసు.

6అతడి వైపు నుంచి నీ దృష్టి మరల్చుకో. కూలిపని వాడిలాగా తనకు నియమింపబడిన పని పూర్తి చేసేదాకా అతని వైపు చూడకు.

7చెట్టును నరికి వేస్తే అది తిరిగి చిగురు వేస్తుందనీ, లేత కొమ్మలు తిరిగి మొలకెత్తుతాయనీ ఆశాభావం ఉంటుంది.

8నరికేసిన చెట్టు వేరు భూమిలో కుళ్లిపోయి, దాని మొదలు మట్టిలో చీకిపోతూ ఉంటుంది.

9అయితే దానికి నీటి వాసన తగిలినప్పుడు అది చిగురు వేస్తుంది, లేత మొక్కలాగా కొత్తగా కొమ్మలు కాస్తుంది.

10అయితే మనుషులు చనిపోయినప్పుడు కదలకుండా పడి ఉంటారు. మనుషులు ప్రాణం విడిచిన తరువాత వాళ్ళు ఏమైపోతారు?

11సముద్రంలో నీళ్ళు ఎలా ఇంకిపోతాయో, నదిలో నీళ్ళు ఎలా ఆవిరైపోతాయో అలాగే మనుషులు చనిపోయి ఇక తిరిగి లేవరు.

12ఆకాశం అంతరించి పోయేదాకా వాళ్ళు మేల్కోరు. ఎవరూ వారిని నిద్ర లేపలేరు.

13నువ్వు నన్ను మృత్యులోకంలో దాచి ఉంచితే ఎంత మేలు! నా మీద నీ కోపం చల్లారే దాకా మరుగు చేస్తే ఎంత బాగుంటుంది! నాకు కొంతకాలం గడువుపెట్టి ఆ తరువాత నన్ను జ్ఞాపకం చేసుకోవాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను.

14మనుషులు చనిపోయిన తరువాత మళ్ళీ బ్రతుకుతారా? ఆలా జరిగే పక్షంలో నా పోరాటం ముగిసి నాకు విడుదల కలిగేదాకా నేను ఎదురుచూస్తూ ఉంటాను.

15అప్పుడు నువ్వు పిలుస్తావు. నేను నీతో మాట్లాడతాను. నీ చేతిపనిని చూసి నువ్వు ఇష్టపడతావు.

16అయితే ఇప్పుడు నేను వేసే అడుగులు నువ్వు లెక్కిస్తున్నావు. నేను చేసే పాపాలు నీకు కోపం తెప్పిస్తున్నాయి.

17నా అతిక్రమాలు సంచిలో ఉంచి మూసివేశావు. నేను చేసిన దోషాలను భద్రంగా దాచిపెట్టావు.

18కూలిపోయిన పర్వతాలు ముక్కలైపోయి నేలమట్టం అవుతాయి, కొండలు వాటి స్థానం తప్పి పడిపోతాయి.

19నీళ్ళు రాళ్లను అరగదీస్తాయి. నీటి ప్రవాహం భూమిపై మట్టి కొట్టుకుపోయేలా చేస్తుంది. ఆ విధంగా నువ్వు మనిషి ఆశలను భగ్నం చేశావు.

20నువ్వు మనుషులను ఎప్పటికీ అణచివేస్తున్నావు గనుక వారు అంతరించిపోతారు. నువ్వు వాళ్ళ ముఖాలను చావు ముఖాలుగా మార్చివేసి వాళ్ళను వెళ్లగొట్టావు.

21ఒకవేళ వాళ్ళ పిల్లలు ప్రఖ్యాతి చెందినా అది వారికి తెలియదు. ఒకవేళ అణిగిపోయి దీనస్థితి అనుభవించినా వాళ్ళు అది గ్రహించలేరు.

22తమ సొంత శరీరాల్లోని బాధ మాత్రమే వాళ్ళు అనుభవిస్తారు. తమకు తామే ఎక్కువగా దుఃఖపడతారు.

TEL-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Telugu - 2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]