Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Jonah 3 OTSA

Side by side with the Father's Heart Bible™

యోనా నీనెవెకు వెళ్లుట

1తర్వాత యెహోవా వాక్కు రెండవసారి యోనాకు వచ్చింది: 2“నీవు మహా పట్టణమైన నీనెవెకు వెళ్లి నేను నీకు ఇచ్చే సందేశాన్ని ప్రకటించు.”

3యోనా యెహోవా మాటకు లోబడి నీనెవెకు వెళ్లాడు; నీనెవె చాలా పెద్ద పట్టణం కాబట్టి దానిగుండా వెళ్లడానికి మూడు రోజుల పట్టింది. 4యోనా ఆ పట్టణంలో ఒక రోజు ప్రయాణమంత దూరం వెళ్లి, “ఇంకా నలభై రోజులకు నీనెవె నాశనమవుతుంది” అని అంటూ ప్రకటించాడు. 5నీనెవె ప్రజలు దేవున్ని నమ్మి ఉపవాసం ప్రకటించారు. గొప్పవారి నుండి సామాన్యుల వరకు అందరు గోనెపట్ట కట్టుకున్నారు.

6యోనా హెచ్చరిక నీనెవె రాజుకు చేరినప్పుడు, అతడు తన సింహాసనం దిగి, తన రాజ వస్త్రాలను తీసివేసి, గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. 7అతడు నీనెవెలో ఈ ప్రకటన చేశాడు: “రాజు, అతని ఘనుల శాసనం ప్రకారం: “మనుష్యులు గాని జంతువులు పశువులు గొర్రెల మందలు గాని దేన్ని రుచి చూడకూడదు తినకూడదు త్రాగకూడదు.

8మనుష్యులు పశువులు గోనెపట్ట కప్పుకోవాలి. అందరు తక్షణమే దేవున్ని వేడుకోవాలి. తమ చెడు మార్గాలను, దౌర్జన్యాన్ని మానివేయాలి. 9దేవుని మనస్సు మార్చుకుని కనికరంతో తన తీవ్రమైన కోపాన్ని విడిచిపెట్టి మనం నశించకుండా చేస్తారేమో ఎవరికి తెలుసు?”

10వారు చేసింది, వారు ఎలా తమ చెడుతనాన్ని విడిచిపెట్టారో దేవుడు చూసి తన మనస్సు మార్చుకొని, ఆయన వారికి మీదికి రప్పిస్తానని చెప్పిన కీడును రానివ్వలేదు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]