Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Exodus 26 OTSA

Side by side with the Father's Heart Bible™

సమావేశ గుడారం

1“పది తెరలతో సమావేశ గుడారాన్ని తయారుచేయాలి. వాటిని నీలం ఊదా ఎరుపు రంగులతో పేనిన సన్నని నారతో చేసి, వాటిపై చేయితిరిగిన పనివానితో కెరూబులను అల్లాలి. 2తెరలన్నీ ఇరవై ఎనిమిది మూరల పొడవు నాలుగు మూరల వెడల్పు కలిగి ఒకే కొలతతో ఉండాలి. 3అయిదు తెరలను ఒక దానితో ఒకటి కలిపి ఒక్కటిగా చేయాలి; మిగిలిన అయిదింటిని కూడా అలాగే చేయాలి. 4ఒక కూర్పులోని తెరల చివర మొదటి తెర అంచుకు నీలి నూలుతో ఉచ్చులు చేయాలి. రెండవ కూర్పులోని బయటి తెర చివర కూడా అలాగే చేయాలి. 5ఒక తెరకు యాభై ఉచ్చులు చేసి, ఉచ్చులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేలా మరొకదాని తెర అంచుకు యాభై ఉచ్చులు చేయాలి. 6తర్వాత యాభై బంగారు గుండీలు తయారుచేసి ఆ గుండీలతో ఆ తెరలను ఒక దానితో ఒకటి కలిపినప్పుడు అది ఒకే సమావేశ గుడారంగా ఉంటుంది.

7“సమావేశ గుడారం పైకప్పుగా ఉండే గుడారం కోసం మేక వెంట్రుకలతో మొత్తం పదకొండు తెరలు తయారుచేయాలి. 8పదకొండు తెరలన్నీ పొడవు ముప్పై మూరలు, వెడల్పు నాలుగు మూరలు కలిగి ఒకే కొలతతో ఉండాలి. 9అయిదు తెరలను ఒకటిగా మిగతా ఆరు తెరలను ఒకటిగా కలపాలి. ఆరవ తెరను గుడారం ముందు భాగంలో మడతపెట్టాలి. 10మొదటి కూర్పులోని చివరి తెర అంచున, అలాగే రెండవ కూర్పులోని చివరి తెర అంచున యాభై ఉచ్చులు చేయాలి. 11యాభై ఇత్తడి గుండీలు తయారుచేసి ఒకటే గుడారమయ్యేలా ఆ గుండీలను ఆ ఉచ్చులకు తగిలించి కూర్చాలి. 12గుడారపు తెరల అధనపు పొడవు విషయానికొస్తే, మిగిలిన సగం తెర సమావేశ గుడారం వెనుక భాగం దగ్గర క్రిందకు వ్రేలాడి ఉండాలి. 13గుడారపు తెరలు ఒక ప్రక్క ఒక మూర మరో ప్రక్క ఒక మూర పొడవు ఉండి, మిగిలిన భాగం సమావేశ గుడారాన్ని కప్పి ఉంచేలా దాని ప్రక్కల మీద వ్రేలాడదీయాలి. 14గుడారం కోసం ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల చర్మంతో పైకప్పును, దానిపైన మన్నికైన తోళ్లతో పైకప్పు తయారుచేయాలి.

15“సమావేశ గుడారానికి తుమ్మకర్రతో నిలువు పలకలు తయారుచేయాలి. 16ప్రతి చట్రం పొడవు పది మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర ఉండాలి. 17రెండు కొయ్యమేకులు ఒకదానికొకటి సమాంతరంగా అమర్చాలి. సమావేశ గుడారపు చట్రాలన్నిటిని ఈ విధంగా తయారుచేయాలి. 18సమావేశ గుడారపు దక్షిణ వైపుకు ఇరవై చట్రాలు తయారుచేయాలి. 19ప్రతి చట్రానికి క్రింద రెండు కొయ్య మేకులకు రెండు దిమ్మల చొప్పున ఇరవై చట్రాలకు నలభై వెండి దిమ్మలు తయారుచేయాలి. 20మరోవైపుకు, అంటే సమావేశ గుడారానికి ఉత్తర వైపుకు, ప్రతి చట్రం క్రింద రెండు చొప్పున, ఇరవై చట్రాలు తయారుచేయాలి. 21నలభై వెండి దిమ్మలు తయారుచేయాలి. 22పడమర వైపు అంటే సమావేశ గుడారం యొక్క వెనుక వైపు ఆరు చట్రాలు తయారుచేయాలి, 23మూలల కోసం రెండు చట్రాలు తయారుచేయాలి. 24ఈ రెండు మూలల వద్ద అవి క్రింది నుండి పై వరకు రెండింతలు ఉండి ఒకే ఉంగరంలోకి అమర్చబడాలి; రెండూ ఒకేలా ఉండాలి. 25అక్కడ ఎనిమిది చట్రాలు, ప్రతి చట్రం క్రింద రెండేసి చొప్పున పదహారు వెండి దిమ్మలు ఉంటాయి.

26“అలాగే తుమ్మకర్రతో అడ్డకర్రలు తయారుచేయాలి: సమావేశ గుడారానికి ఒక ప్రక్కన ఉన్న చట్రాలకు అయిదు అడ్డకర్రలు, 27రెండవ వైపున ఉన్నవాటికి అయిదు, సమావేశ గుడారానికి వెనుక వైపున పడమర వైపున ఉన్న చట్రాలకు అయిదు అడ్డకర్రలు చేయాలి. 28మధ్య అడ్డకర్ర, చట్రాల మధ్యలో ఈ చివరి నుండి ఆ చివరి వరకు విస్తరించాలి. 29ఆ చట్రాలను బంగారంతో పొదిగించి, అడ్డకర్రలు ఉంచడానికి బంగారు ఉంగరాలు చేయాలి. అలాగే అడ్డకర్రలను కూడా బంగారంతో పొదిగించాలి.

30“కొండమీద నీకు చూపించిన నమూనా ప్రకారమే సమావేశ గుడారాన్ని నిలబెట్టాలి.

31“నీలం ఊదా ఎరుపు రంగుల్లో పేనిన సన్నని నారతో ఒక తెరను చేయించి, నిపుణుడైన పనివానితో దానిమీద కెరూబులను అల్లించాలి. 32తుమ్మ చెక్కతో నాలుగు స్తంభాలు చేసి బంగారంతో పొదిగించి నాలుగు వెండి దిమ్మలపై నిలబెట్టిన నాలుగు స్తంభాలకు బంగారు కొక్కేలతో దానిని వ్రేలాడదీయాలి. 33ఆ తెరను కొలుకుల క్రింద తగిలించి నిబంధన మందసాన్ని ఆ తెర వెనుక ఉంచాలి. ఈ తెర పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తుంది. 34అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం మీద ప్రాయశ్చిత్త మూతను ఉంచాలి. 35తెర బయట సమావేశ గుడారానికి ఉత్తరం వైపు బల్ల ఉంచి దానికి ఎదురుగా దక్షిణం వైపు దీపస్తంభాన్ని ఉంచాలి.

36“గుడారపు ప్రవేశ ద్వారానికి నీలం, ఊదా ఎరుపు రంగులతో పేనిన సన్నని నారతో బుటా పనితో ఒక తెర తయారుచేయాలి. 37ఈ తెర కోసం తుమ్మ చెక్కతో అయిదు స్తంభాలు చేసి వాటిని బంగారంతో పొదిగించాలి, అలాగే బంగారు కొక్కేలు చేయాలి. తర్వాత వాటికి అయిదు ఇత్తడి దిమ్మలు చేయాలి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]