Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

1 John 3 OTSA

Side by side with the Father's Heart Bible™

1మనం దేవుని పిల్లలమని పిలువబడునట్లు, తండ్రి ఎంత గొప్ప ప్రేమను మనపై కురిపించాడో చూడండి! మనం దేవుని పిల్లలమే. ఈ కారణంగానే లోకానికి మనం తెలియదు. ఎందుకంటే దానికి ఆయన తెలియదు. 2ప్రియ మిత్రులారా, మనం ఇప్పుడు దేవుని పిల్లలమే కాని, ఇక ఏమి కానున్నామో ఇంకా స్పష్టం కాలేదు. క్రీస్తు ప్రత్యక్షమైనపుడు, ఆయన యథార్థ రూపాన్ని మనం చూస్తాము కాబట్టి, ఆయన వలె ఉంటామని తెలుసుకుంటాము. 3ఆయనలో నిరీక్షణ ఉంచు ప్రతివారు, ఆయన పవిత్రుడై ఉన్నట్లే తనను పవిత్రునిగా చేసుకుంటారు.

4పాపం చేసే ప్రతివారు ఆజ్ఞను అతిక్రమిస్తారు; ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. 5పాపాలను తొలగించడానికే క్రీస్తు ప్రత్యక్షమయ్యారని మీకు తెలుసు. ఆయనలో ఎలాంటి పాపం లేదు. 6ఆయనలో జీవించేవారు ఎవరూ పాపంలో కొనసాగరు. పాపంలో కొనసాగేవారు ఆయనను ఎన్నడూ చూడలేదు తెలుసుకోలేదు.

7ప్రియ పిల్లలారా, మీరు ఎవరిచేత మోసపోకండి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు, నీతిని జరిగించే ప్రతివారు నీతిమంతులే. 8సాతాను మొదటి నుండి పాపం చేస్తున్నాడు, కాబట్టి పాపం చేసేవారు సాతాను సంబంధులు, సాతాను కార్యాలను నాశనం చేయడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యారు. 9దేవుని వలన పుట్టిన ప్రతివారిలో ఆయన బీజం నిలిచి ఉంటుంది; కాబట్టి వారు పాపంలో కొనసాగరు. వారు దేవుని మూలంగా పుట్టారు కాబట్టి పాపం చేయలేరు. 10దీనిని బట్టి దేవుని పిల్లలెవరో సాతాను పిల్లలెవరో మనకు తెలుస్తుంది; నీతిని జరిగించని వారు, తన సహోదరుని, సహోదరిని ప్రేమించనివారు దేవుని పిల్లలు కారు.

ఒకరిపట్ల ఒకరికి ప్రేమ ద్వేషం

11మనం మొదటి నుండి వింటున్న సందేశం: మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి 12కయీను వలె ఉండవద్దు, అతడు దుష్టునికి చెందినవాడై తన సహోదరుని చంపాడు. అతడు తన సహోదరుని ఎందుకు చంపాడు? ఎందుకంటే అతడు చేసిన పనులు చెడ్డవి, అతని సహోదరుని పనులు నీతి గలవి. 13నా సహోదరి సహోదరులారా, ఒకవేళ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, ఆశ్చర్యపడకండి. 14మనం ఒకరిని ఒకరం ప్రేమిస్తున్నాము, కాబట్టి మరణంలో నుండి జీవంలోనికి దాటిపోయామని మనకు తెలుసు. ప్రేమ లేనివారు మరణంలో నిలిచివుంటారు. 15తన సహోదరిని, సహోదరుని ద్వేషించేవారు నరహంతకులు, ఏ నరహంతకునిలో నిత్యజీవం ఉండదని మీకు తెలుసు.

16ఆయన మన కొరకై తన ప్రాణం పెట్టారు, కాబట్టి దీని వలన ప్రేమ ఎలాంటిదో మనం తెలుసుకుంటున్నాము. మనం కూడా మన సహోదరి సహోదరుల కోసం మన ప్రాణాలను పెట్టాలి. 17ఈ లోకపు ఆస్తులు కలిగినవారు అవసరంలో ఉన్న తన సహోదరుని సహోదరిని చూసి కూడా వారిపై కనికరం చూపించకపోతే, వారిలో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? 18ప్రియ పిల్లలారా, మనం కేవలం మాటలతో సంభాషణలతో కాకుండా, చేతలతో సత్యంలో ప్రేమిద్దాము.

19దీనిని బట్టి, మనం సత్యానికి సంబంధించినవారమని మనకు తెలుస్తుంది, మన హృదయాలు ఆయన సన్నిధిలో విశ్రాంతిగా ఉంటాయి; 20మన హృదయం మనపై దోషారోపణ చేస్తే, మన హృదయం కంటే దేవుడు గొప్పవాడని ఆయన సమస్తాన్ని ఎరిగినవాడని మనం తెలుసుకుంటాము. 21ప్రియ స్నేహితులారా, మన హృదయం మనపై దోషారోపణ చేయకపోతే, దేవుని ముందు ధైర్యంగా ఉంటాము. 22ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయనకు సంతోషం కలిగించే పనులు చేస్తే, మనం అడిగిన ప్రతిదాన్ని ఆయన నుండి పొందుకుంటాము. 23ఆయన ఆజ్ఞ ఇదే: ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచి, ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. 24దేవుని ఆజ్ఞలను పాటించేవారు వారు ఆయనలో ఉంటారు, వారిలో ఆయన ఉంటారు. ఆయన మనకు ఇచ్చిన ఆత్మ ద్వారా ఆయన మనలో ఉన్నారని మనకు తెలుస్తుంది.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]