Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Telugu - 2019

Ezra 1 IRVTel

Side by side with the Father's Heart Bible™

కోరెషు రాజాజ్ఞ

1యెహోవా తాను యిర్మీయా ద్వారా పలికిన మాటలు నెరవేర్చడానికి పర్షియా రాజు కోరెషు పాలన మొదటి సంవత్సరంలో రాజు మనస్సును ప్రేరేపించాడు. అతడు తన రాజ్యమంతటా రాతపూర్వకంగా చాటింపు వేయించి ఇలా ప్రకటించాడు. 2“పర్షియా రాజు కోరెషు ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు. ఆకాశంలో ఉండే దేవుడైన యెహోవా లోకంలో ఉన్న ప్రజలందరినీ నాకు లోబరిచాడు. ఆయన యూదా దేశంలో ఉన్న యెరూషలేములో తనకు మందిరం కట్టించాలని నాకు ఆజ్ఞ ఇచ్చాడు. 3మీలో ఆయన ప్రజలందరికీ దేవుడు తోడుగా ఉంటాడు గాక. వారు యూదా దేశంలోని యెరూషలేముకు బయలుదేరి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరాన్ని కట్టాలి. 4యెరూషలేములో వివిధ ప్రాంతాల్లో మిగిలి ఉన్న ప్రజలు దేవుని మందిరం కట్టించడానికి ఇష్టపూర్తిగా తమ దగ్గరున్న వెండి బంగారాలను, వస్తువులను, పశువులను ఇచ్చి సహాయం చేయాలి.”

5అప్పుడు యూదా పెద్దలు, బెన్యామీనీయుల పెద్దలు, యాజకులు, లేవీయులు ఎవరి మనస్సులను దేవుడు ప్రేరేపించాడో వారంతా సమకూడి యెరూషలేములో ఉన్న యెహోవా మందిరం కట్టడానికి బయలుదేరారు. 6మిగిలి ఉన్న ప్రజలు ఇష్టపూర్వకంగా ఇచ్చినవి కాకుండా, వెండి వస్తువులు, బంగారం, పశువులు, విలువైన వస్తువులు ఇచ్చి వారికి సహాయం చేశారు.

7ఇవి కాక, నెబుకద్నెజరు యెరూషలేము నుండి దోచుకుని వచ్చి తన దేవుళ్ళ గుడుల్లో ఉంచిన యెహోవా మందిర ఉపకరణాలను కోరెషు రాజు బయటికి తీయించాడు. 8కోరెషు రాజు తన కోశాధికారి మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క వేయించి, వాటిని యూదుల అధిపతి షేష్బజ్జరు చేతికి అప్పగించాడు. 9వాటి మొత్తం లెక్క 30 బంగారం పళ్ళాలు, 1,000 వెండి పళ్ళాలు, 29 కత్తులు, 1030 బంగారం గిన్నెలు, 410 చిన్న వెండి గిన్నెలు, ఇంకా 1,000 వేరే రకం వస్తువులు. 11బంగారు, వెండి వస్తువులు అన్నీ కలిపి 5, 400. ఈ మొత్తం వస్తువులతోపాటు బబులోను చెర నుండి విడుదలైన వారిని కూడా వెంటబెట్టుకుని షేష్బజ్జరు యెరూషలేముకు తీసుకువచ్చాడు.

TEL-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Telugu - 2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]