Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Telugu - 2019

Ecclesiastes 3 IRVTel

Side by side with the Father's Heart Bible™

ప్రతిదానికి సమయం

1ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికీ ప్రతి ఉద్దేశానికీ ఒక సమయం ఉంది.

2పుట్టడానికీ, చనిపోడానికీ నాటడానికీ, నాటిన దాన్ని పెరకడానికీ

3చంపడానికీ, స్వస్థపరచడానికీ కూలదోయడానికీ, కట్టడానికీ

4ఏడవడానికీ, నవ్వడానికీ, దుఃఖించడానికీ, నాట్యం చేయడానికీ

5రాళ్లను పారవేయడానికీ, వాటిని పోగు చేయడానికీ ఎదుటి వారిని కౌగలించుకోడానికీ, మానడానికీ

6వస్తువులను వెదకడానికీ, పోగొట్టుకోడానికీ దాచుకోడానికీ, పారవేయడానికీ

7వస్త్రాలను చింపడానికీ, కుట్టడానికీ మౌనం వహించడానికీ, మాటలాడడానికీ

8ప్రేమించడానికీ, ద్వేషించడానికీ యుద్ధం చేయడానికీ, సంధి చేసుకోడానికీ ఇలా ప్రతిదానికీ ఒక సమయం ఉంది.

9కష్టపడి పని చేసిన వారికి దాని వలన వచ్చిన లాభమేముంది?

10మానవులు చేయడానికి దేవుడు వారికి ఇచ్చిన పని ఏమిటో నేను చూశాను.

11దేవుడు ప్రతి దానినీ దాని కాలానికి సరిపడినట్టుగా చేశాడు. ఆయన నిత్యమైన జ్ఞానాన్ని మానవుల హృదయాల్లో ఉంచాడు. దేవుని కార్యాలను మొదటి నుండి చివరి వరకూ పూర్తిగా గ్రహించడానికి అది చాలదు.

12కాబట్టి మానవులకు బతికినంత కాలం సంతోషంగా, మంచి జరిగిస్తూ ఉండడం కంటే శ్రేష్ఠమైనదేదీ లేదని నేను గ్రహించాను. 13ప్రతి ఒక్కరూ అన్నపానాలు పుచ్చుకుంటూ తన కష్టార్జితాన్ని అనుభవించడం దేవుడిచ్చే బహుమానమే అని కూడా గ్రహించాను.

14దేవుడు చేసే పనులన్నీ నిత్యమైనవి అని నాకు తెలుసు. దానికి మరి దేనినీ కలపలేము, దానినుండి దేనినీ తీయలేము. మానవులు తనలో భయభక్తులు కలిగి ఉండాలని దేవుడే ఈ విధంగా నియమించాడు.

15గతంలో జరిగిందే ఇప్పుడూ జరుగుతుంది. తరవాత జరగబోయేది కూడా ఇంతకు ముందు జరిగిందే.మానవులు మర్మమైన సంగతులు వెదికేలా దేవుడు చేస్తాడు.

సమస్త జీవం వ్యర్థం

16అంతేగాక ఈ లోకంలో న్యాయతీర్పు జరిగించే స్థలాల్లో, నీతి ఉండాల్సిన స్థలాల్లో నాకు దుష్టత్వం కనిపించింది. 17“మంచివారికీ చెడ్డవారికీ వారి ప్రతి ప్రయత్నానికీ, పనికీ తగిన సమయంలో దేవుడే తీర్పు తీరుస్తాడు” అని నా హృదయంలో అనుకున్నాను.

18తాము జంతువుల్లాటి వారని మానవులు తెలుసుకోవాలని దేవుడు అలా చేస్తున్నాడని నేను అనుకున్నాను.

19ఎందుకంటే జంతువులకు జరుగుతున్నట్టే మనుషులకీ జరుగుతూ ఉంది. ఇద్దరి గతీ ఒక్కటే. జంతువులు చనిపోతాయి, మనుషులూ చనిపోతారు. జీవులన్నిటికీ ఒక్కటే ప్రాణం. జంతువుల కంటే మనుషులకు ఎక్కువేమీ లేదు. అంతా ఆవిరిలాగా నిష్ప్రయోజనం కదా!

20అంతా ఒక్క చోటికే వెళతారు. అంతా మట్టిలోనుండి పుట్టింది, ఆ మట్టిలోకే తిరిగి పోతుంది.

21మనుషుల ఆత్మ పరలోకానికి ఎక్కిపోతుందనీ జంతువుల ప్రాణం భూమిలోకి దిగిపోతుందనీ ఎవరికి తెలుసు? 22మనిషికి తన తరువాత ఏం జరగబోతున్నదో చూపించడానికి వారిని తిరిగి వెనక్కి తెచ్చేవాడు ఎవరున్నారు? కాబట్టి వారు తమ పనిలో సంతోషించడం కంటే శ్రేష్టమైంది వారికేమీ లేదని నేను తెలుసుకున్నాను. అదే వారు చేయవలసింది.

TEL-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Telugu - 2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]