Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Telugu - 2019

1 Chronicles 18 IRVTel

Side by side with the Father's Heart Bible™

దావీదు విజయాలు

1ఇది జరిగిన తరువాత దావీదు ఫిలిష్తీయుల మీద దాడి చేసి వాళ్ళను జయించాడు. గాతు పట్టణాన్ని, దాని గ్రామాలను, ఫిలిష్తీయుల ఆధీనంలోనుంచి లాగేసుకున్నాడు. 2తరువాత అతడు మోయాబీయులను జయించగా వాళ్ళు దావీదుకు కప్పం కట్టి దాసోహమయ్యారు.

3తరువాత, సోబా రాజు హదరెజెరు యూఫ్రటీసు నది వరకూ తన అధికారం స్థాపించడానికి బయలు దేరగా హమాతు దగ్గర దావీదు అతన్ని ఓడించాడు. 4అతని దగ్గర నుంచి వెయ్యి రథాలను, ఏడువేల గుర్రపు రౌతులను, ఇరవైవేల మంది సైనికులను స్వాధీనం చేసుకున్నాడు. దావీదు వాటిలో వంద రథాలకు సరిపడిన గుర్రాలు ఉంచుకుని, మిగిలిన వాటికి చీలమండ నరాలు తెగవేయించాడు.

5సోబా రాజు హదరెజెరుకు సాయం చెయ్యాలని దమస్కులోని అరామీయులు వచ్చినప్పుడు, దావీదువారిలో ఇరవై రెండు వేలమందిని హతం చేశాడు. 6తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యాన్ని ఉంచాడు. అరామీయులు దావీదుకు కప్పం కట్టి దాసోహమన్నారు. ఈ ప్రకారం దావీదు వెళ్లిన ప్రతి చోటా యెహోవా అతనికి సహాయం చేస్తూ వచ్చాడు.

7దావీదు ఇంకా, హదరెజెరు సేవకులు స్వాధీనంలో ఉన్న బంగారు డాళ్లను యెరూషలేముకు తీసుకొచ్చాడు. 8హదరెజెరు పట్టణాలు టిబ్హతు నుంచీ కూను నుంచీ దావీదు లెక్క లేనంత ఇత్తడిని తీసుకొచ్చాడు. తరువాతి కాలంలో సొలొమోను దీనితోనే ఇత్తడి సముద్రాన్ని, స్తంభాలను, ఇత్తడి వస్తువులను చేయించాడు.

9దావీదు సోబా రాజు హదరెజెరు సైన్యం అంతటినీ ఓడించాడన్న వార్త హమాతు రాజు తోహూకు వినబడింది. 10హదరెజెరుకూ తోహూకూ మధ్య విరోధం ఉంది కాబట్టి రాజైన దావీదు హదద్ ఎజెరుతో యుద్ధం చేసి అతన్ని ఓడించినందుకు, దావీదు క్షేమం తెలుసుకోడానికీ, అతనితో శుభవచనాలు పలకడానికీ, బంగారంతో, వెండితో, ఇత్తడితో చేసిన అనేక రకాలైన పాత్రలు ఇచ్చి, తోహూ తన కొడుకు హదోరమును అతని దగ్గరికి పంపించాడు. 11ఈ వస్తువులను కూడా రాజైన దావీదు, తాను ఎదోమీయుల దగ్గర నుంచి, మోయాబీయుల దగ్గర నుంచి, అమ్మోనీయుల దగ్గర నుంచి, ఫిలిష్తీయుల దగ్గర నుంచి, అమాలేకీయుల దగ్గర నుంచి తీసుకొన్న వెండి బంగారాలతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించాడు.

12ఇంకా సెరూయా కొడుకు అబీషై ఉప్పు లోయలో ఎదోమీయుల్లో పద్దెనిమిది వేలమందిని హతం చేశాడు. 13దావీదు ఎదోములో కావలి సైన్యాన్ని ఉంచాడు. ఎదోమీయులందరూ అతనికి దాసులయ్యారు. దావీదు వెళ్లిన ప్రతిచోటా యెహోవా అతన్ని రక్షించాడు.

14ఈ విధంగా దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా ఉండి తన ప్రజలందరికీ నీతిన్యాయాలు జరిగించాడు. 15సెరూయా కొడుకు యోవాబు సైన్యాధిపతి. అహీలూదు కొడుకు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల లేఖరి. 16అహీటూబు కొడుకు సాదోకూ, అబ్యాతారు కొడుకు అబీమెలెకూ యాజకులు. షవ్శా శాస్త్రి. 17యెహోయాదా కొడుకు బెనాయా కెరేతీయులకూ, పెలేతీయులకూ అధిపతి. ఇంకా, దావీదు కొడుకులు రాజుకు సహాయకులు.

TEL-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Telugu - 2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]