Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Daniel 6 OTSA

Side by side with the Father's Heart Bible™

సింహాల గుహలో దానియేలు

1దర్యావేషు తన రాజ్యమంతటిని పాలించడానికి 120 మంది అధిపతులను నియమించాడు. 2వీరి మీద ముగ్గురు నిర్హాహకులను నియమించాడు, ఆ ముగ్గురిలో దానియేలు ఒకడు. రాజుకు నష్టం వాటిల్లకుండ ఆ అధిపతులు ఈ ముగ్గురికి లెక్క అప్పచెప్పాలి. 3అయితే దానియేలు తనకున్న గొప్ప లక్షణాలను బట్టి అధిపతులకంటే, నిర్వాహకులకంటే ప్రత్యేకంగా ఉన్నాడు కాబట్టి రాజు తన రాజ్యమంతటి మీద అతన్ని నియమించాలని అనుకున్నాడు. 4అందువల్ల నిర్వాహకులు, అధిపతులు దానియేలు మీద నేరం మోపడానికి అతని ప్రభుత్వ నిర్వహణలో లోట్ల కోసం వెదికారు కాని, అతడు నమ్మకస్థుడు, నేరం లేనివాడు. వారు అతనిలో ఎలాంటి నేరం కనుగొనలేకపోయారు. 5చివరికి ఈ మనుష్యులు, “ఈ దానియేలు మీద నేరం మోపడానికి ఎలాంటి కారణం ఎన్నడు మనకు దొరకదు, దొరికితే తన దేవుని ధర్మశాస్త్రం విషయంలో దొరకవచ్చు” అని అనుకున్నారు.

6కాబట్టి ఈ నిర్వాహకులు, అధిపతులు గుంపుగా రాజు దగ్గరకు వెళ్లి ఇలా అన్నారు, “రాజైన దర్యావేషు చిరకాలం జీవించు గాక! 7రానున్న ముప్పై రోజుల్లో ఎవరైనా మీకు తప్ప ఏ దేవునికైనా, మనిషికైనా ప్రార్థిస్తే వారు సింహాల గుహలో పడవేయబడాలని రాజు ఒక ఆదేశం జారీ చేసి, దానిని అమల్లోకి తీసుకురావాలని రాజ్య నిర్వాహకులు, ప్రముఖులు, అధిపతులు, సలహాదారులు, రాష్ట్ర అధికారులు అందరం ఏకీభవించి కోరుతున్నాము. 8రాజా! ఈ శాసనాన్ని ఇచ్చి, అది మాదీయుల పర్షియా చట్టం ప్రకారం అది రద్దు కాకుండా, మార్చబడకుండా ఉండేందుకు దానిని వ్రాతపూర్వకంగా ఇవ్వండి.” 9కాబట్టి రాజైన దర్యావేషు శాసనాన్ని రాయించి, సంతకం చేశాడు.

10అయితే ఈ శాసనం ఇవ్వబడిందని దానియేలు తెలిసినప్పటికీ అతడు ఇంటికి వెళ్లి యెరూషలేము వైపు తెరచిన కిటికీలు ఉన్న తన పైగదికి వెళ్లాడు. అతడు గతంలో చేసినట్టు, రోజుకు మూడుసార్లు మోకరించి ప్రార్థన చేస్తూ, తన దేవునికి స్తుతులు చెల్లించాడు. 11అప్పుడు ఈ మనుష్యులు గుంపుగా వెళ్లి, దానియేలు ప్రార్థన చేస్తూ, దేవుని సహాయం కోసం వేడుకోవడం చూశారు. 12కాబట్టి వారు రాజు దగ్గరకు వెళ్లి, తన రాజ శాసనం గురించి చెప్తూ, “రాజా! వచ్చే ముప్పై రోజుల వరకు మీకు తప్పా ఏ దేవునికి గాని మనిషికి గాని ప్రార్థన గాని చేయకూడదని, అలా చేస్తే వారు సింహాల గుహలో పడవేయబడాలని శాసనం ఇచ్చారు కదా?” అన్నారు. రాజు జవాబిస్తూ, “ఆ శాసనం అమలు చేయబడుతుంది. మాదీయుల పర్షియా వారి చట్టం ప్రకారం అది రద్దు చేయబడదు” అన్నాడు.

13అప్పుడు వారు రాజుతో అన్నారు, “రాజా! యూదా నుండి వచ్చిన బందీలలో ఒకడైన దానియేలు మిమ్మల్ని కాని మీరు సంతకం చేసిన శాసనాన్ని గాని లెక్క చేయట్లేదు. అతడు ఇంకా మూడుసార్లు ప్రార్థన చేస్తున్నాడు.” 14ఇది విని రాజు చాల బాధపడ్డాడు; ఎలాగైనా దానియేలును కాపాడాలని, సూర్యాస్తమయం వరకు అతన్ని విడిపించాలని ఎంతో ప్రయత్నించాడు.

15అప్పుడు ఆ మనుష్యులు రాజైన దర్యావేషు దగ్గరకు గుంపుగా వెళ్లి, “రాజా! మాదీయ పర్షియా వారి చట్టం ప్రకారం రాజు చేసిన శాసనాన్ని గాని తీర్మానాన్ని గాని ఎవరు మార్చకూడదనే విషయాన్ని మీరు గుర్తుచేసుకోవాలి” అన్నారు.

16అప్పుడు రాజు ఆదేశం ఇవ్వగా, వారు దానియేలును తీసుకెళ్లి సింహాల గుహలో పడవేశారు. రాజు దానియేలుతో, “నీవు నిత్యం సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు” అని అన్నాడు.

17ఒక రాయి తీసుకువచ్చి దానితో గుహ ద్వారాన్ని మూసివేశారు. దానియేలు విషయంలో నిర్ణయాన్ని మార్చుకోకుండ రాజు తన రాజ ముద్రను, ప్రముఖుల ముద్రలను రాతి మీద వేశాడు. 18తర్వాత రాజు భవనానికి వెళ్లి రాత్రంతా ఉపవాసం ఉండి వినోదాలను జరగనియ్యలేదు. అతనికి నిద్రపట్టలేదు.

19తెల్లవారే సమయంలో రాజు లేచి, సింహాల గుహ దగ్గరకు త్వరగా వెళ్లాడు. 20రాజు సింహాల గుహ దగ్గరకు చేరుకుని దుఃఖ స్వరంతో, “దానియేలూ! సజీవ దేవుని సేవకుడా! నిత్యం నీవు సేవించే నీ దేవుడు సింహాల బారి నుండి నిన్ను రక్షించగలిగారా?” అని అన్నాడు.

21దానియేలు జవాబిస్తూ, “రాజు చిరకాలం జీవించు గాక! 22నా దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్ళు మూయించారు. అవి నాకు హాని చేయలేదు, ఎందుకంటే ఆయన దృష్టిలో నేను నిర్దోషిని. రాజా! మీ ఎదుట కూడా నేను ఏ తప్పు చేయలేదు” అన్నాడు.

23రాజు ఎంతో సంతోషించి దానియేలును గుహలో నుండి బయటకు తీసుకురమ్మని ఆదేశించాడు. దానియేలు తన దేవున్ని నమ్మాడు కాబట్టి అతడు బయటకు వచ్చినప్పుడు, అతని మీద ఏ గాయం లేదు.

24రాజు ఆజ్ఞమేరకు, దానియేలు మీద తప్పుడు నేరం మోపిన వ్యక్తులను వారి భార్య పిల్లలతో పాటు సింహాల గుహలో పడవేశారు. వారు ఇంకా గుహ నేలను తాకకముందే సింహాలు వారిని చీల్చి, వారి ఎముకలన్నిటిని నలుగగొట్టాయి.

25అప్పుడు రాజైన దర్యావేషు భూమిపై ఉన్న దేశాలన్నిటికి, వివిధ భాషల ప్రజలందరికి: “మీరు గొప్పగా వృద్ధి పొందుదురు గాక!

26“నా రాజ్యంలో ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజలంతా దానియేలు దేవునికి భయపడాలి ఆయనను గౌరవించాలని నేను ఆదేశిస్తున్నాను.“ఆయన జీవంగల దేవుడు.ఆయన ఎల్లకాలం జీవిస్తారు;ఆయన రాజ్యం నాశనం కాదు,ఆయన అధికారం ఎప్పటికీ అంతం కాదు.

27ఆయన రక్షిస్తారు, కాపాడతారు;ఆకాశంలో, భూమి మీదఆయన సూచకక్రియలు అద్భుతాలు చేస్తారు.ఆయనే దానియేలునుసింహాల నుండి కాపాడారు” అని వ్రాయించాడు.

28కాబట్టి దానియేలు దర్యావేషు రాజు పరిపాలనలోను పర్షియా వాడైన కోరెషు రాజు పరిపాలనలోను వృద్ధి చెందాడు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]