Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Telugu - 2019

Genesis 46 IRVTel

Side by side with the Father's Heart Bible™

యాకోబు ఐగుప్తు ప్రయాణం

1ఇశ్రాయేలు తనకున్నదంతా తీసుకు ప్రయాణమై బెయేర్షెబా వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించాడు. 2అప్పుడు రాత్రి దర్శనంలో దేవుడు “యాకోబూ, యాకోబూ” అని ఇశ్రాయేలును పిలిచాడు. అందుకతడు “చిత్తం ప్రభూ” అన్నాడు. 3ఆయన “నేనే దేవుణ్ణి, మీ తండ్రి దేవుణ్ణి. ఐగుప్తు వెళ్ళడానికి భయపడవద్దు. అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను. 4నేను నీతో కూడా ఐగుప్తు వస్తాను. నేను నిన్ను తప్పకుండా ఇక్కడికి తిరిగి తీసుకువస్తాను. నువ్వు చనిపోయేటప్పుడు యోసేపు తన సొంత చేతులతో నీ కళ్ళు మూస్తాడు.”

5యాకోబు లేచి బెయేర్షెబా నుండి తరలి వెళ్ళాడు. ఫరో అతనినెక్కించి తీసుకు రావడానికి పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కొడుకులు తమ తండ్రి యాకోబునూ తమ పిల్లలనూ తమ భార్యలనూ ఎక్కించారు. 6యాకోబు అతనితో పాటు అతని సంతానమంతా ఐగుప్తు వచ్చారు. వారు తమ పశువులనూ తాము కనానులో సంపాదించిన సంపదనంతా తీసికెళ్లారు. 7అతడు తన కొడుకులనూ మనుమలనూ తన కూతుర్లనూ తన కొడుకుల కూతుర్లనూ తన సంతానాన్నంతా తనతో ఐగుప్తు తీసుకు వచ్చాడు.

8ఐగుప్తుకు వచ్చిన ఇశ్రాయేలు కొడుకుల పేర్లు ఇవే.

9యాకోబు పెద్ద కొడుకు, రూబేను. రూబేను కొడుకులు, హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.

10షిమ్యోను కొడుకులు, యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనానీయురాలి కొడుకు షావూలు.

11లేవి కొడుకులు, గెర్షోను, కహాతు, మెరారి.

12యూదా కొడుకులు ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. (ఏరు, ఓనాను, కనాను దేశంలో చనిపోయారు). పెరెసు కొడుకులు హెస్రోను, హామూలు.

13ఇశ్శాఖారు కొడుకులు తోలా, పువ్వా, యోబు, షిమ్రోను.

14జెబూలూను కొడుకులు సెరెదు, ఏలోను, యహలేలు.

15వీరు లేయా కొడుకులు. ఆమె పద్దనరాములో యాకోబుకు వారిని అతని కూతురు దీనానూ కన్నది. అతని కొడుకులూ అతని కుమార్తెలూ మొత్తం ముప్ఫై ముగ్గురు.

16గాదు కొడుకులు సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, ఆరోదీ, అరేలీ.

17ఆషేరు కొడుకులు ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. వారి సోదరి శెరహు. బెరీయా కొడుకులు హెబెరు, మల్కీయేలు. 18లాబాను తన కూతురు లేయా కిచ్చిన జిల్పా కొడుకులు వీరే. ఆమె ఈ పదహారు మందిని యాకోబుకు కన్నది.

19యాకోబు భార్య అయిన రాహేలు కొడుకులు యోసేపు, బెన్యామీను.

20యోసేపుకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టారు. వారిని ఐగుప్తుదేశంలో ఓనుకు యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతు అతనికి కన్నది.

21బెన్యామీను కొడుకులు బెల, బేకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహీరోషు, ముప్పీము, హుప్పీము, ఆర్దు. 22యాకోబుకు రాహేలు కనిన కొడుకులైన వీరంతా పద్నాలుగురు.

23దాను కొడుకు హుషీము.

24నఫ్తాలి కొడుకులు యహనేలు, గూనీ, యేసెరు, షిల్లేము. 25లాబాను తన కూతురు రాహేలుకు ఇచ్చిన బిల్హా కొడుకులు వీరే. ఆమె వారిని యాకోబుకు కన్నది. వారంతా ఏడుగురు. 26యాకోబు కోడళ్ళను మినహాయించి అతని వారసులు యాకోబుతో ఐగుప్తుకు వచ్చిన వారంతా అరవై ఆరుగురు. 27ఐగుప్తులో యోసేపుకు పుట్టిన కొడుకులు ఇద్దరు. ఐగుప్తుకు వచ్చిన యాకోబు కుటుంబీకులు మొత్తం డెభ్భై మంది.

28యాకోబు గోషెనుకు దారి చూపడానికి యోసేపు దగ్గరికి యూదాను తనకు ముందుగా పంపాడు. వారు గోషెను ప్రాంతానికి వచ్చారు. 29యోసేపు తన రథాన్ని సిద్ధం చేయించి తన తండ్రి ఇశ్రాయేలును కలుసుకోడానికి గోషెనుకు వచ్చాడు. యోసేపు అతన్ని చూసి, అతని మెడను కౌగలించుకుని చాలా సేపు ఏడ్చాడు. 30అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో “నీవింకా బతికే ఉన్నావు. నీ ముఖం చూశాను. కాబట్టి నేనిక చనిపోగలను” అని చెప్పాడు.

31యోసేపు తన సోదరులతో తన తండ్రి కుటుంబం వారితో “నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియచేసి, ‘కనాను దేశంలో ఉన్న నా సోదరులూ నా తండ్రి కుటుంబం వారూ నా దగ్గరికి వచ్చారు. 32వారు గొర్రెల కాపరులు. పశువులను మేపేవారు. వారు తమకు కలిగినదంతా తీసుకు వచ్చారు’ అని అతనితో చెబుతాను. 33కాబట్టి ఫరో మిమ్మల్ని పిలిపించి, ‘మీ వృత్తి ఏంటి?’ అని అడిగితే 34‘మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ మేమూ మా పూర్వీకులంతా కాపరులం.’ మీరు గోషెను ప్రాంతంలో నివసించేలా ఇలా చెప్పండి. ఎందుకంటే, గొర్రెల కాపరి వృత్తిలో ఉన్నవారంటే ఐగుప్తీయులకు అసహ్యం.”

TEL-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Telugu - 2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]