Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Telugu - 2019

Esther 7 IRVTel

Side by side with the Father's Heart Bible™

హామాను పతనం

1రాజు, హామాను రెండవ రోజు ఎస్తేరు రాణి దగ్గరికి విందుకు వచ్చారు. 2రాజు “ఎస్తేరు రాణీ, నీ విన్నపం ఏమిటి? అది నెరవేరుస్తాను. నీ మనవి ఏమిటి? అర్థ రాజ్యమైనా సరే నీకు ఇస్తాను” అని ద్రాక్షారసం పోస్తూ ఉండగా ఎస్తేరుతో అన్నాడు.

3అప్పుడు ఎస్తేరు రాణి ఇలా జవాబిచ్చింది “రాజా, నీ అనుగ్రహానికి నేను నోచుకుంటే రాజువైన తమకు అంగీకారం అయితే, నా ప్రాణం నిలిచేలా చేయండి. ఇదే నా నివేదన. నా జాతి ప్రజల ప్రాణాల విషయంలో కూడా నేను వేడుకుంటున్నాను. 4నేను, నా జాతి ప్రజలు, సమూల నాశనానికి, సంహారానికి, తుడిచి పెట్టి వేయడానికి అమ్ముడుబోయాము. మేమంతా ఆడ, మగ బానిసలుగా అమ్ముడుబోయినట్టైతే నేను నోరు విప్పేదాన్ని కాదు. ఎందుకంటే ఆ మాత్రం ఇబ్బందికి రాజువైన మీకు బాధ ఇవ్వడం భావ్యం కాదు గదా.”

5అందుకు రాజైన అహష్వేరోషు “వాడెవడు? ఈ పని చేయడానికి సాహసించిన వాడెక్కడ?” అని ఎస్తేరు రాణిని అడిగాడు. 6ఎస్తేరు “మా విరోధి అయిన ఆ శత్రువు, దుష్టుడైన ఈ హామానే” అంది. అప్పుడు రాజు, రాణి ముందు హమానుకు ముచ్చెమటలు పోశాయి. 7రాజు పట్టరాని కోపంతో ద్రాక్షారసం విందును విడిచి చరచరా అంతఃపురం తోటలోకి వెళ్ళాడు. అయితే రాజు తనను సర్వనాశనం చేసే ఆలోచన చేస్తున్నాడని హమాను భయపడ్డాడు. అతడు తన ప్రాణాలు కాపాడమని ఎస్తేరు రాణిని ప్రాధేయ పడసాగాడు.

8అంతఃపురం తోటలోనుండి ద్రాక్షారసం విందు స్థలానికి రాజు తిరిగి వచ్చి ఎస్తేరు కూర్చున్న తల్పం మీద హామాను పడి ఉండడం చూశాడు. “వీడు నా ఇంట్లో నేను చూస్తుండగానే రాణిని బలాత్కారం చేస్తాడా?” అన్నాడు. ఆ మాట రాజు నోట రాగానే సైనికులు హామాను ముఖానికి ముసుకు వేశారు. 9రాజు సముఖంలో ఉన్న అధికారుల్లో హర్బోనా అనే వాడు “అయ్యా, రాజు ప్రాణాలు కాపాడేందుకు మాట్లాడిన మొర్దెకైని ఉరి తీయాలని ఈ హామాను 50 మూరల ఎత్తున్న ఉరి కొయ్య ఒకటి చేయించాడు. అది హామాను ఇంటి దగ్గర ఉంది” అని చెప్పాడు. వెంటనే రాజు “దాని మీద వీడిని ఉరి తీయండి” అని ఆజ్ఞ ఇచ్చాడు.

10ఆ విధంగా హామాను మొర్దెకై కోసం సిద్ధం చేసిన ఉరి కొయ్య మీద వాళ్ళు అతడినే ఉరి తీశారు. అప్పుడు రాజు ఆగ్రహం చల్లారింది.

TEL-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Telugu - 2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]