Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Telugu - 2019

2 Kings 1 IRVTel

Side by side with the Father's Heart Bible™

అహజ్యాకు ఏలీయా ప్రవచనం

1అహాబు చనిపోయిన తరువాత మోయాబు దేశం ఇశ్రాయేలు రాజ్యంపై తిరుగుబాటు చేసింది. 2అప్పుడే అహజ్యా షోమ్రోనులోని తన మేడగది కిటికీలో నుండి కింద పడి గాయపడ్డాడు. అప్పుడతడు దూతలను పిలిచి “మీరు ఎక్రోను దేవుడు బయల్జెబూబు దగ్గరికి వెళ్ళి ఈ గాయం మాని బాగుపడతానో లేదో కనుక్కుని రండి” అని వారికి చెప్పి పంపించాడు.

3కానీ యెహోవా దూత తిష్బీ వాడైన ఏలీయాతో ఇలా అన్నాడు. “నీవు లేచి సమరయ రాజు పంపిన దూతలను కలుసుకో. వారికిలా చెప్పు. ఎక్రోను దేవుడైన బయల్జెబూబును సంప్రదించడానికి వెళ్తున్నారా? ఇశ్రాయేలులో అసలు దేవుడనే వాడు లేడనుకున్నారా? 4సరే, యెహోవా ఇలా చెప్తున్నాడు. నీవు కచ్చితంగా ఎక్కిన పడుకున్న పడక దిగకుండానే చనిపొతావు.” ఏలీయా వారికిలా చెప్పి వెళ్ళిపోయాడు.

5తరువాత ఆ దూతలు రాజు దగ్గరికి తిరిగి వచ్చేశారు. రాజు “మీరు ఎందుకు తిరిగి వచ్చారు?” అని అడిగాడు. 6వారు ఇలా అన్నారు “ఒక వ్యక్తి మాకు ఎదురయ్యాడు. అతడు మాతో మిమ్మల్ని పంపిన రాజు దగ్గరకి తిరిగి వెళ్ళండి. అతనితో ఇలా చెప్పండి. యెహోవా చెప్పేదేమిటంటే ఎక్రోను దేవుడైన బయల్జెబూబును సంప్రదించడానికి దూతలను పంపుతున్నావా? ఇశ్రాయేలులో దేవుడు లేడనుకున్నావా? కాబట్టి నీవు ఎక్కిన మంచం ఇక దిగవు. కచ్చితంగా చనిపోతావు, అని చెప్పాడు.”

7అప్పుడు రాజు “మిమ్మల్ని కలుసుకుని ఈ మాటలు చెప్పినవాడు ఎలా ఉన్నాడు?” అని అడిగాడు. 8అందుకు వారు “అతడు గొంగళి కట్టుకుని తోలు నడికట్టు పెట్టుకుని ఉన్నాడు” అన్నారు. అప్పుడు రాజు “ఆ వ్యక్తి తిష్బీ వాడైన ఏలీయానే” అన్నాడు.

9అప్పుడు రాజు యాభై మంది సైనికులతో ఒక అధికారిని ఎలీయా దగ్గరికి పంపించాడు. ఎలీయా ఒక కొండ మీద కూర్చుని ఉన్నాడు. ఆ అధికారి ఎలీయా ఉన్న చోటికి కొండ ఎక్కి వచ్చాడు. అతడు ఎలీయాతో “ఇదిగో, దేవుని మనిషీ, రాజు నిన్ను దిగి రమ్మంటున్నాడు” అన్నాడు. 10అందుకు ఏలీయా “నేను దేవుని మనిషినే అయితే ఆకాశం నుండి అగ్ని కురిసి నిన్నూ నీ యాభై మందినీ కాల్చి వేస్తుంది గాక” అన్నాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని కురిసి ఆ అధికారినీ అతనితో ఉన్న యాభై మందినీ కాల్చి వేసింది.

11ఆహాజు రాజు మరో యాభై మంది సైనికులతో ఇంకో అధికారిని పంపించాడు. ఇతడు కూడా ఎలీయాతో “ఇదిగో, దేవుని మనిషీ, రాజు నిన్ను త్వరగా దిగి రమ్మంటున్నాడు” అన్నాడు. 12అందుకు ఏలీయా “నేను దేవుని మనిషినే అయితే ఆకాశం నుండి అగ్ని కురిసి నిన్నూ నీ యాభై మందినీ కాల్చి వేస్తుంది గాక” అని జవాబిచ్చాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని కురిసి ఆ అధికారినీ అతనితో ఉన్న యాభై మందినీ కాల్చి వేసింది.

13అయినా రాజు మూడోసారి మరో యాభై మంది సైనిక బృందాన్ని పంపించాడు. వీళ్ళ అధికారి కొండ పైకి వెళ్ళాడు. ఇతడు ఎలీయా ఎదుట మోకాళ్ళపై వంగి ప్రాధేయ పూర్వకంగా “దేవుని మనిషీ, నిన్ను వేడుకుంటున్నాను. నీ దృష్టిలో నా ప్రాణాన్నీ, నీ సేవకులైన ఈ యాభై మంది ప్రాణాలనూ విలువైనవిగా ఉండనీ. 14ఇంతకు ముందు వచ్చిన ఇద్దరు అధికారులనూ, వాళ్ళ సైనికులనూ నిజంగానే ఆకాశం నుండి దిగి వచ్చిన అగ్ని కాల్చివేసింది. కానీ ఇప్పుడు నా ప్రాణం నీ దృష్టికి విలువైనదిగా ఉండనీ” అన్నాడు.

15అప్పుడు యెహోవా దూత ఎలీయాతో “దిగి అతనితో కూడా వెళ్ళు. అతనికి భయపడకు” అని చెప్పాడు. కాబట్టి ఎలీయా లేచి అతనితో కూడా రాజు దగ్గరికి వెళ్ళాడు. 16తరువాత ఎలీయా అహజ్యాతో ఇలా అన్నాడు. “నీవు ఎక్రోను దేవుడైన బయల్జెబూబు దగ్గరికి దూతలను పంపించావు. ఈ సంగతులు అడిగి తెలుసుకోడానికి ఇశ్రాయేలులో దేవుడు లేడనుకున్నావా? కాబట్టి ఇప్పుడు నీవు పండుకున్న మంచం పైనుండి దిగవు. కచ్చితంగా చనిపోతావు.”

17ఏలీయా పలికిన యెహోవా మాట ప్రకారం ఆహాజు రాజు చనిపోయాడు. అతనికి కొడుకు లేడు. అందుచేత అతని స్థానంలో అతని సోదరుడైన యెహోరాము రాజు అయ్యాడు. యూదా రాజు యెహోషాపాతు కొడుకు యెహోరాము పాలన రెండవ సంవత్సరంలో ఇది జరిగింది. 18అహజ్యా గూర్చిన ఇతర సంగతులు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి.

TEL-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Telugu - 2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]